Tuesday, 2 March 2010

ఇంకాసేపట్లో .....




సమయం రాత్రి రెండుగంటలు .
ఇంకో మూడుగంటల్లో హైదరాబాద్ విమానం.
ఇంకో ఆరుగంటల్లో హైదరాబాద్లో వాలుతా.తలచుకుంటే వచ్చే ఆనందానికి వెలకట్టలేము.ఆలోచనల్లో ఇంకో రెండుగంటలు కరిగిపోయాయి.
చెక్-ఇన్ చేస్తున్నారు.ఒక సారి ఇంటికి కాల్ చేశాను బయలుదేరుతున్న అని చెప్పడానికి.నేను దుబాయిలో బయలుదేరగానే వాళ్ళు వరంగల్లో బయలుదేరుతారు.ఇద్దరం ఒకేసారి హైదరాబాద్ చేరుకుంటాం.
అక్కడ వాళ్ళు బయలుదేరారట .ఇక్కడ కూడా నా విమానం బయలుదేరింది.
ఇంకో మూడుగంటల్లో హైదరాబాద్ చేరుకుంటా మా వాళ్ళని చూస్తా.తలుచుకుంటే ఆనందానికి అవధుల్లేవు.మొత్తానికి హైదరాబాద్లో దిగాను.ఇంకో అరగంటలో చెక్-అవుట్ అయిపోయి మా వాళ్ళని చూస్తా .
అరగంట అయింది.బయటికి వెళ్ళగానే
మా ఫ్రెండ్స్ నన్ను చూసి అరుపులు.నడకలో వేగం పెరిగింది.వెళ్ళగానే తెల్లగా అయ్యావని ఒకడు,బక్కగా అయ్యావని ఒకడు,నన్ను చుట్టుముట్టేశారు.ఉక్కిరి బిక్కిరి ఎవరితో మాట్లాడుతున్నానో తెలియదు.అందరు వున్నా నా కళ్ళు వేరే చోట వెతుకుతున్నాయి.ఒక్కసారి వెనక్కి చూసాను.బావ ,మేనల్లుల్లు .నేను చూస్తున్నది వాళ్ళ గురించే ,వెళ్లి వాళ్ళని పలకరించి చిన్నల్లుడు నన్ను గుర్తుపడుతాడ అని నాకున్న చిన్న డౌట్ క్లియర్ చేసుకున్నాను.అందర్నీ చూసి మాట్లాడేసరికి ఎయిర్పోర్ట్ లోనే గంట గడిచింది.ఇంకో మూడు గంటల్లో వరంగల్ చేరుకుంటా.అమ్మని ,నాన్నని,అక్కని,అందర్ని చూస్తా.
కాని అప్పుడు కే.సి.ఆర్.నిరాహారదీక్ష కారణంగా అడుగడుగునా రాస్తారోకోలు ,ధర్నాలు .మొత్తానికి ఇంటికి చేరుకునేసరికి ఇంకో ఆరుగంటలు పట్టింది.దారంతా నాకంత వింతగా అనిపిస్తుంది.ఒక్క నిమిషం వేస్ట్ చెయ్యకుండా నన్ను సావగోడుతునే వున్నారు మా ఫ్రెండ్స్.ధర్నా జరుగుతున్నచోట్ల ఫోటోస్ దిగుతూ మొత్తానికి మా వూరు చేరుకున్నాము.నేను వెళ్లేసరికి మా ఇల్లు నిండిపోయింది.చుట్టాలతో,ఇంటిపక్కవాల్లతో.అందర్ని చూసే సరికి కళ్ళ వెంబడి నీళ్ళు కారుతూనే వున్నాయి.ఆ నిమిషాన్ని కోట్లు పెట్టిన కొనలేము .మా ఇల్లు మొత్తం మారిపోయింది.అస్సలు నేను చుసిన ఇల్లుకు ఇప్పుడు చూసే ఇల్లుకు పోలికే లేదు.అమ్మ కళ్ళలో అప్పుడు చుసిన కాంతి ఇంకా నాకు కనపడుతూనే వుంది.ఇంకా నా అనుభవాలని ఇంకో టపాలో పంచుకుంటా.

Monday, 7 December 2009

ఇదంతా నిజమే!



మాఊరి గురించి ఇప్పటికే ఊదరగొట్టి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను.
ఈసారి కూడా తప్పడం లేదు.
మా ఊరు అంత అందమైనది ఎం కాకున్నా నాకిష్టం.
చూడాలి ఊరిని
నేను మొదటిసారి (అదే చివరి సారి)సిగరెట్ తాగి నాన్నకి దొరికిన మా క్రికెట్ గ్రౌండ్ ని చూడాలి.
ఎప్పుడూ వినాయకుడిని పెట్టె చింతచెట్టు కలలో వచ్చింది దాన్ని చూడాలి.
మేము ఎప్పుడూ కూర్చునే గోడ మల్లి గుర్తొస్తుంది.
ఎప్పుడూ దొంగతనంగా క్రికెట్ ఆడే స్కూల్ గ్రౌండ్ చూడాలనిపిస్తుంది.
పొద్దున్న లేస్తే పేపర్ కొరకు కొట్టుకుకే రచ్చబండ(గడ్డమీద) ని చూడాలి
నేను యు.కే వచ్చాక కట్టిన గుడిని(ఇప్పటి వరకు నేను చూడంది) చూడాలి.
పెళ్లి కుదిరిన చెల్లిని
పెళ్ళైన వదిన ని
వీటన్నికంటే ముందు అమ్మని,నాన్నని,అక్కని,బావని,అల్లుళ్ళని,చేల్లెల్లని,ఫ్రెండ్స్ ని చూడాలని వుంది
ఎందుకంటే ఇవన్ని చూడక అక్షరాల రెండున్నరేళ్ళు.
ఆ చూసే రోజు ఎంతో దూరం లో లేదు.
ఇంకొన్ని గంటల్లో అన్నీ చూస్తా.
తలుచుకుంటే అంత నిజమేనా అనిపిస్తుంది.
కాకపోతే ఒక్కటే బాధ.
తెలంగాణా ఉద్యమం వాళ్ళ వరంగల్ పరిస్థితి బాలేదట.
అంత బాగుపడి నేను ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటూ.
నేను వెళ్ళాక నాకు ఎదురయ్యే సంఘటనలు,అనుభవాలు ఇంకో టపాలో త్వరలోనే రాస్తా..

Tuesday, 10 November 2009

ఒక వర్షం కురిసిన రాత్రి


వానకి ఇంకేం పని లేదు కావచ్చు నిద్రాహారాలు మానేసి మాఊరి మీద పడ్డది ఇవ్వాల
అంత జోరుగా పడుతాంది .
కుండపోత అంటే ఏంటో మల్లోకసారి చెప్పింది ఆరోజు,
పొద్దుగాల షురు అయిన వాన రాత్రి అయిన ఇంకా పడుతనే వున్నది.
వాన చెయ్యబట్టి కరెంటు కూడా పోయింది.
ఒక పక్క క్రికెట్ మ్యాచ్ మిస్సవుతున్నమన్న కోపంతో వానని తిడుతాన
ఒక పక్క పెద్దపెద్దోలందరూ జర సంతోషపడుతాండ్లు
చెరువులు నిండుతనాయని.
ఇగ టైంపాస్ కాగ నేను కూడా అమ్మలక్కలతో కూసోని సొల్లు ఏసుడు షురు చేసిన.
కాసేపటికి మా ఇంటి పక్క కవితక్క వచ్చి
ఏడుపు మొహంతో మా ఉదయ్ గాడు కనపడుతలేదు అన్నది .
మేమంతా ఆమె మొహం చూసి నవ్వుకొని ఏడనో ఆడుతాంటాడు.నువ్వేం పరేషాన్ కాకు అని చాల ఈజీగ చెప్పేసి మల్ల సొల్లు షురు చేసినం.
మల్ల ఇంకో అరగంట కి కవితక్క వాళ్ళ భర్త రఘన్న వచ్చి అదే ముచ్చట చెప్పిండు.లేవకుంటే ఏమన్న అనుకుంటాడు అన్నట్టు ఈ సారి జర బద్దకంగానే కదిలినం ఒక పది మందిమి.
బయట వాన లొల్లి పెడుతనే వుంది.
వానలో టార్చ్ పట్టుకొని పిలగాడు దొరికితే రెండుపీకాలి అని మనసులో అనుకుంటూ బయటకి పోయినం మెల్లగా.
అప్పటికే ఒక నూరు నూటయాభై మంది టార్చ్ లతో వేట సాగిస్తున్నారు.
ఇదేదో లొల్లి అయేట్టే వుందనుకుని అనుకునేలోగా వేటగాళ్ళ సంఖ్య 300 దాటింది(ఊరంతా ఇదే పని మీద వున్నారు).
ఊర్లో వున్న ఇళ్ళన్నీ వెతికినం
చర్చి,మసీదు,గుడి అన్ని వెతికినం
పొలాలు, స్కూల్ అన్ని వెతుకుతూనే వున్నాం.
ఒక్కొక్కటి వెతుకుతుంటే నమ్మకం సన్నగిల్లుతుంది.
అదొక మిస్టరీ లాగ వుంది అక్కడున్నోలందరికి.
ఒక పక్క వాళ్ళ ఇంట్లోల్లు ఏడుపులు పెంచేశారు.
మాకు కూడా మెల్లగా బయం అందుకుంది.
అప్పటికి వెతకడం షురు చేసి 4గంటలు.కాని ఫలితం శూన్యం
నేను ఒక ఇంట్లో వెతుకుతుంటే బయట నుండి పెద్ద కేక పిలగాడు దోరికిండు అని,
పొయ్యి ఒక్కటి పీకుదామని కోపంతో పోయిన.
పొయ్యే సరికి వేరే పిలగాన్ని చూసి ఈ పిలగాడు అనుకున్నారట
మల్ల లొల్లి మొదటికి వచ్చింది.
మల్ల ఇంకో 2 ఇండ్లు వెతగ్గానే నాకు యాష్ట వచ్చింది.అంతలోనే కరెంటు కూడా వచ్చింది.
మల్లి నా మనసు మ్యాచ్ వైపు మళ్ళింది.
ఒక్కసారి స్కోరు చూసి వచ్చి మల్ల వెతుకుదాం అనుకోని
ఒక 4 అడుగులు వేసానో లేదో పిడుగులాంటి వార్త.
6ఏళ్ళ ఉదయ్ వాళ్ళింటి పక్కన గుంత లో పడిపోయి పంచప్రాణాలు వదిలేసాడు.
అదెప్పుడు జరిగిందో ఎలా జరిగిందో ఇంకా మిస్టరీనే.
కాని ఊరంతటిని కుదిపేసిన ఈ సంఘటన మీద ఊర్ల ఇప్పటికి చర్చ జరుగుతూనే వుంటది

Friday, 11 September 2009

Sunday, 30 August 2009

పట్టపగలే చుక్కల్లో చంద్రుడు


పగలే చంద్రుడు అబ్బా ఎంతమంచి వర్ణన .నాకు మాత్రం దడ పుట్టించిన వర్ణన.
ఈ సోదేంటి అనుకుంటున్నారా .అసలు విషయంలోకి దూకుతున్న.

ఎప్పటిలాగే సంక్రాంతి పండగ వచ్చింది.అక్క ,అక్క వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చారు. సరదాగా సంక్రాంతి జరిగింది.ఇక మరుసటి రోజు సాయంత్రం అక్క ని వాళ్ళింట్లో (కరీంనగర్)లో దింపి నేను హైదరాబాద్ కి వెళ్ళాలి. ఇక్కడివరకి అంత సవ్యంగానే వుంది.కాని ఈ రెండు పనుల కంటే ముందు మా ఆచారం ఒకటి నిర్వర్తించాల్సి వచ్చింది.అదే సంక్రాంతి మరునాడు ఫ్రెండ్స్ తో కలిసి సినిమా కి వెళ్ళడం. ఒక్కడు మూవీ లో మహేష్ బాబు లాగ ఒక పెద్ద ప్లాన్ వేసాము నేను మా ఫ్రెండ్స్. అదేంటంటే మాట్నీషో సాయంకాలం ఐదింటికి అయిపోతుంది.మా అక్క వాళ్ళ ట్రైన్ ఆరింటికి. మేము ధియేటర్ నుండి డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి వస్తాము మీరు అక్కడ వెయిట్ చేయండి అని ఇంట్లో కస్టపడి మా నాన్నకి ఈ విషయం తెలియకుండా మా అక్క ని ఒప్పించి సినిమా కి బయలుదేరాము. మమూలుగా మేము పది మంది ఫ్రెండ్స్ సినిమా కి పోయేవాల్లము. ఈ సారి ఆ సంఖ్య ముప్పై కి పెరిగింది. ధియేటర్ లో ఒక రో అంత మాకే కేటాయించారు. అది చుక్కల్లో చంద్రుడు మూవీ. మూవీ లేట్ చేయకుండా కరెక్ట్ టైం కి వేసాడు ధియేటర్ వాడు. అబ్బా అంత చక్కగా అన్ని జరిగిపోతున్నాయి అనుకుని రిలాక్ష్ అవుతున్నా.
కరెక్ట్ గా అప్పుడు స్టార్ట్ చేసాడు నా పక్కవాడు అరుపులు. నాకే వాడి అరుపులు దరిద్రంగా వినపడుతున్నాయి. ఇక నా వెనక కూర్చున్న ఆడవాళ్ళ సంగతి వర్ణనాతీతం . అంతలోనే మేనేజర్ రావడం గోల చేయకండి అనడం.వెనక ఎస్పీ వాళ్ళ ఫ్యామిలీ మూవీ చూస్తున్నారు అనడం. నా కుడికన్ను అధరడం. మా వాడు సిటీ కి ఎంతో మంది ఎస్పీ లు వస్తారు పోతారు కాని చంటి గాడు లోకల్ అనడం అన్ని నాకు తెలియకుండా జరిగిపోయాయి. ఎస్పీ అయితే ఫ్రీ గా చూస్తారు మేము ముప్పై రూపాయలు పెట్టి టికెట్ కొన్నాము అని మా వాడు మల్లి వెంటనే అనడం .మల్లి గోల స్టార్ట్ చేయడం అన్ని అయిపోయాయి.నాది ప్రేక్షక పాత్ర అయిపోయింది. ఇదంతా కేవలం సినిమా స్టార్ట్ అయిన ఇరవై నిమిషాల్లోనే.
అంతలోనే ఇద్దరు దిట్టంగా వున్నా గార్డ్స్ రావడం వాడికి బడిత పూజ చేయడం అయ్యాయి.అది చూడలేక నేను సారీ సర్.మల్లి రిపీట్ కాదు అనడం .వాణ్ని కాదు రా.వీణ్ణి చితక్కొట్టండి అని వాళ్ళు అనడం. నాకు రెండు దెబ్బలు పడటం.మా ముప్పై మంది ఆ ఇద్దరినీ చితక్కోట్టడం అన్ని జరిగిన కొద్దిసేపటికే తెలిసింది మా వాళ్ళు కొట్టింది యునిఫోరం లో లేని పోలీసులని అని. ఇక అసలు సినిమా అప్పుడు స్టార్ట్ అయింది .రక్షక్ జీప్ రావడం మమ్మల్ని అందులో వేయడం అన్ని నిమిషాల్లో జరిగిపోయాయి.
అక్కడ ఏమి జరిగి వుంటుందో మీ ఊహ కి వదిలేస్తున్న.
చివరికి నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐదు గంటలు అవ్వనే అయింది.గుండెల్లో ఐదు గంటలు మోగాయి. ఎలాగోలాగ వాళ్ళని బ్రతిమిలాడి కొంత అమ్యమ్యాలు సమర్పించుకుని నేనోక్కన్ని బయటపడి ట్రైన్ టైం కి రైల్వే స్టేషన్ చేరుకుని హమ్మయ్య అనేలోపు నాన్న ని చూసి పిడుగు పడింది.
ఎందుకు లేట్ అయింది నాన్న ప్రశ్న
మూవీ ప్రింట్ లేట్ అయింది నా జవాబు.
నిజం చెప్పు అని గద్దింపు.
అదే నిజం అని నా జవాబు .
నాకు అంత తెలుసు అనేసరికి పిడుగు నాలో,
ట్రైన్ వస్తే బావుండు అనుకుంటుండగా ట్రైన్ గంట లేట్ అని వార్త.మల్లి పిడుగు.
ఇక ఆ గంట నరకం నా జన్మ లో మల్లి ఇప్పటివరకి చూడలేదు.
గంటసేపు వచ్చి పోయే ప్రయానికులకి నేను చేసిన ఘనకార్యం చెప్పుకుంటూ ,నా గురించి సుప్రభాతం చదువుతుంటే అబ్బా చెవులకి ఎంత వినసొంపో.
అలా నేను పట్టపగలే చుక్కల్లో చంద్రుణ్ణి చూసాను.
ఇది జరిగి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయిన ఇప్పటికి మమ్మల్ని చుక్కల్లో చంద్రులు అనే పిలుస్తున్నారు.
ఒక్కసారిగా కోపం వస్తుంది.కాని ఏంచేస్తాం .ఆది లో ntr లాగ కంట్రోల్ కంట్రోల్ అనుకోవడం తప్ప.
( అరిచి నన్ను ఇరికించిన ఘనున్ని పై చిత్రంలో చూడొచ్చు)

ఆ షాక్ తో ఇంతవరకి మల్లి సంక్రాంతి సినిమాలు బంద్ . సిద్దార్థ సినిమాలు బంద్.
అంత హిట్ అయిన బొమ్మరిల్లు ఇంతవరకి చూడలేదు నేను .

Wednesday, 17 June 2009

మా ఊరి పండగ




టేకులగూడెం మా వూరు. మా వూరిలో అతి పెద్ద పండగ అంటే వినాయకచవితి. యువకులకి,పిల్లలకి మరియు పెద్దలకి ప్రాణం ఈ పండగ టేకులగూడెం యువకుడు ఈ పండగ మిస్స వుతున్నాడు అంటే అంతకన్నా దరిద్రుడు ఇంకొకడు వుండదు అలా నేను 2 సార్లు దరిద్రాన్ని అనుభవించాను. ఈ సరి ఆ దరిద్రం రావద్దు అని ఆ వినాయకుడిని కోరుకుంటున్న కాని అయన కూడా నా కోరిక తీర్చేలా లేదు. వినాయక చవితి అంటే అప్పాట్లో మా వూరిలొ అస్సలు పాట్టించుకునే వాళ్ళు కారట అది వ్యాపారుల పండగ అని అనుకునే వాళ్లట.కాని సరిగ్గా 15 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఆ పండగ రూపురేఖలనే మార్చేసింది మా ఊరిలో. అప్పుడు నేను ఆరవ తరగతి చదువుతున్న రోజులు.నేను హాస్టల్ లో వుండేవాన్ని.ఒక సరి ఈ పండగ కి ఊరికి వచ్చాను .అప్పుడు పిల్లలమంతా కలిసి ఒక ౩౦ రూపాయలు పోగేసి ఒక చిన్న విగ్రహం తెచ్చి ఆడుకుంటుంటే ఒకతను వచ్చి ఇలా చెయ్యొద్దు .ఇదే విగ్రహాన్ని అక్కడ పెట్టండి అందరు పూజలు చేస్తారు అని ఊరి సెంటర్ లో పెట్టించాడు. ఆ ౩౦ రూపాయల వినాయకుడి రేంజ్ ఇప్పుడు ౩౦,౦౦౦ కి దాటింది. కాని అందులో నిర్వాహక కమిటీ సభ్యులు మాత్రం మారలేదు.అప్పుడు ఆరవ తరగతి వాళ్ళు ఇప్పుడు కొందరు పెళ్ళిళ్ళు చేసుకున్న కూడా వినాయక చవితి రాగానే అంత ఆరవ తరగతి పిల్లలు అయిపోతారు ఎన్ని గొడవలు అయిన వినాయకచవితి కి కలిసిపోతారు . వినాయకుడు వున్నాడో లేదో తెలియదు కాని అందరి మద్య సఖ్యత ని కాపాడుతున్నాడు కనుక మేము మాత్రం వున్నదనే అనుకుంటున్నాము. ఆ నవరాత్రులు కంటి మీద కునుకే వుండదు ఎవరికీ. కబడ్డీ కి మల్లి పూర్వవైభవం వచ్చిందా అనే రీతిలో ఆడుతారు ఊరు ఊరంతా హర్షద్వానాలు చేస్తుంటే, వినాయక ఈ సరి అయిన నన్ను నిన్ను చూసేలా చేసుకో జై బోలో గణేష్ మహారాజ కి జై

Sunday, 11 January 2009